Telugu Mirror: ఇటీవలికాలంలో ఎక్కడ చూసినా కుక్క కాటు సంఘటనలే. ఈ సమస్య మన తెలుగు రాష్ట్రాల కే పరిమితం కాలేదు. దేశం లోని అనేక ప్రాంతాలలో సైతం కుక్క కాటు సమస్యలే వెలుగు చూస్తున్నాయి. అయితే ఈ విషయం పై ఇటీవల జరిగిన పరిశోధనలలో విస్మయానికి గురిచేసే నివేదిక వెలువడింది. ఆ నివేదిక ప్రకారం కుక్కల ప్రవర్తన వాతావరణ మార్పులను బట్టి ఉంటుంది అని నివేదించారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ చేసిన పరిశోధనలో వాతావరణంలో వేడి,అల్ట్రా వైలెట్ (యూవీ) స్థాయి పెరిగినప్పుడు కుక్కలు మనుషులకు శత్రువులుగా మారతాయని నివేదికలో పేర్కొన్నారు. కుక్కలలో ఈ మార్పు ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తుందని తెలిపారు.
70 వేలకు పైగా కుక్క కాటు ఘటనల మీద.అధ్యయనం చేసిన హార్వర్డ్ మెడికల్ స్కూల్(Harvard Medical School) తన రిపోర్ట్ లో అందోళన కరమైన విషయాన్ని గుర్తించారు. వేడి కలిగిన వాతావరణంలోనూ మరియు పొల్యూషన్ తో కూడిన వాతావరణం లోనూ కుక్కలు మనుషులపై దాడులకు దిగుతాయని పరిశోధనలో తేలింది. మానవుల పొరపాట్లవలన గ్లోబల్ వార్మింగ్(Global Warming) పెరిగిపోతుందని దీని ప్రభావం కుక్కల పైన కూడా పడుతుందని హార్వర్డ్ పరిశోధకులు చెబుతున్నారు.
జూన్ 15 న ఈ పరిశోధనల నివేదికలను నేచర్ జర్నల్ ప్రచురించింది. శునకాల మీద హార్వర్డ్ స్కూల్ పరిశోధన 10 సంవత్సరాల పాటు అమెరికా(America) లోని 8 ప్రముఖ నగరాల్లో జరిగింది. వాతావరణం వేడిగా మరియు కాలుష్యం అధికంగా ఉన్న రోజులలో శునకాలు హింసాత్మకంగా మారడం కనిపించింది.
ఈ పరిశోధనలోని అంశాలను పరిశీలిస్తే యూవీ లెవెల్ అధికమౌతున్న కొద్దీ కుక్క కరవడాలు 11శాతం పెరుగుతూ వచ్చాయి. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న రోజులలో కుక్క కాట్లు 4 శాతం మేర పెరిగాయి.ఓజోన్(ozone) లెవెల్ అధికమైన రోజులో ఈ కుక్క కాట్లు 3శాతం వరకు పెరిగాయి.అయితే భారీ వర్షాలు పడుతున్న సమయంలో కూడా ఈ ప్రమాదం ఒక శాతం వరకు పెరిగేందుకు ఛాన్స్ ఉందని హార్వర్డ్ స్కూల్ శునకాల పై చేసిన పరిశోధనలలో వెల్లడైనది.