MI vs KKR : కోల్‌కతాను తమ బౌలింగ్‌తో కట్టడి చేసిన ముంబై ఛేజింగ్‌లో తేలిపోయింది. 170 పరుగుల మార్కును అందుకోవడంలో విఫలమై చతికిలపడింది. కోల్‌కతా బౌలింగ్‌లో ముంబై 145 పరుగులకే ఆలౌటైంది. కోల్‌కతా 24 పరుగుల తేడాతో విజయం సాధించింది.
170 పరుగుల లక్ష్యంతో ముంబై ఇండియన్స్‌పై (Mumbai Indians) కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) విజయం సాధించింది. దీంతో సూర్యకుమార్ యాదవ్ (56) మినహా మిగతా బ్యాటర్లంతా పేలవ ప్రదర్శన చేసారు. ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఒక్కడే హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడు. ఒక దశలో ముంబై లక్ష్యాన్ని చేధించేలా కనిపించినా కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వరుస వికెట్లు తీసి ముంబైని ఓడించారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతాను (Kolkata) ముంబై తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. పవర్ ప్లే (Power play) ముగిసేలోపే కోల్‌కతా నాలుగు వికెట్లు కోల్పోయింది. తుషార వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికి ఫిలిప్ సాల్ట్ (5) తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. మూడో ఓవర్ రెండో బంతిలోనూ రఘువంశీ (13) క్యాచ్ ఔటయ్యాడు. చివరి బంతికే శ్రేయాస్ అయ్యర్ (6) కూడా ఔటయ్యాడు. తన ఐదో ఓవర్ రెండో బంతికి నరైన్ (8)ను హార్దిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఏడో ఓవర్లో ఐదో వికెట్ కూడా పడింది. రింకు (9) తొలి బంతికే పీయూష్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
టోపార్డర్ విఫలమై కోల్ కతా కష్టాల్లో పడిన సమయంలో క్రీజులోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్ (70), మనీష్ పాండే (42) ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టు గెలుపుకు కీలకం అయ్యారు. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కోల్‌కతా వరుస వికెట్లు కోల్పోయింది.
వచ్చీ రాగానే సిక్సర్ బాదిన ఆండ్రూ రస్సెల్ (7) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఈ ఓవర్లో కోల్‌కతా రెండు వికెట్లు కోల్పోయింది. 18వ ఓవర్లో బుమ్రా రెండు వికెట్లు తీశాడు. ఆ ఓవర్ నాలుగో బంతికి రమణదీప్ (2) క్యాచ్ అందుకోగా, స్టార్క్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 19.5 ఓవర్ల తర్వాత వెంకటేష్ అయ్యర్ కూడా ఔటయ్యాడు. ఫలితంగా కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లకు 169 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం లక్ష్యంలో భాగంగా బరిలోకి దిగిన ముంబై బ్యాట్స్ మెన్ కు కోల్ కతా స్పిన్నర్లు షాకిచ్చారు. ఫలితంగా రెండో ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది. స్టార్క్ వేసిన రెండో ఓవర్లో దూకుడుగా ఆడుతున్న ఇషాన్ కిషన్ (13) ఔటయ్యాడు. నాలుగో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐదో ఓవర్ తొలి బంతికే నమన్ (11) ఔటయ్యాడు. ఆరో ఓవర్లో రోహిత్ శర్మ (11) భారీ షాట్‌కు ప్రయత్నించగా మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చాడు.
పవర్ ప్లే ముగిసే సమయానికి ముంబై మూడు వికెట్లకు 46 పరుగులు మాత్రమే చేయగలిగింది. వరుస వికెట్లు పడిపోవడంతో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ (4) క్రీజులోకి వచ్చారు. మరోవైపు తొమ్మిదో ఓవర్లో నాలుగో బంతికి నరైన్‌కి క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ ఔటయ్యాడు.
ఆ తర్వాత స్వల్ప తేడాతో ముంబై వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. పదకొండో ఓవర్ ఐదో బంతికి వధేరా (6) అవుటయ్యాడు. 12వ ఓవర్ రెండో బంతికి హార్దిక్ పాండ్యా (1) కూడా ఔటయ్యాడు. నిలకడగా ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ (56) హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ 16వ ఓవర్ మూడో బంతికి రస్సెల్ ఫిలిప్ సాల్ట్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు పంపాడు. టిమ్ ను అవుట్ చేయడంతో కోల్‌కతాకు మ్యాచ్‌పై పూర్తి నియంత్రణ లభించింది.