Yadadri Temple : తెలంగాణలో యాదద్రి పుణ్యక్షేత్రం గురించి మనం వినే ఉంటాం. తెలంగాణాలో ప్రసిద్ధి చెందిన ఈ యాదాద్రి పుణ్యక్షేత్రం రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరిగి ఎక్కువ రద్దీగా మారుతుంది. భక్తుల సంఖ్య పెరగడంతో ఇది తెలంగాణ తిరుపతిగా పేరుగాంచింది.
యాత్రికుల సౌకర్యార్థం యాదాద్రి ఆలయ నిర్వాహకులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తిరుమలలో మాదిరిగానే భక్తులు ఇకపై స్వామివారి దర్శనానిక ఆన్లైన్ సేవలను (Online services) బుక్ చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదాద్రి నర్సన్న ఆలయంలో కూడా యాదాద్రి దేవస్థానం ఆన్లైన్లో టిక్కెట్లను అందుబాటులో ఉంచింది.
వైకుంఠంగా పిలవబడే తిరుమల తరహాలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం తర్వాత.. ఆలయ నిర్మాణం, మాఢవీధులు, స్వామివారి పూజ కైంకర్యాలు, ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలు, యాదాద్రి ప్రసాదాలతో తెలంగాణ తిరుమలగా రూపుదిద్దుకుంటుంది.
వీఐపీ, వీవీఐపీ, లేదా రాజ్యాంగబుద్ధ పదవులపై వచ్చే భక్తులకు 300 రూపాయలకే బ్రేక్ దర్శనం టిక్కెట్టు అందజేస్తున్నారు. శీఘ్ర దర్శనం కోసం ఆన్లైన్లో రూ.150తో నమోదు చేసుకునే అవకాశం ఉండగా, ప్రస్తుతం దేవస్థానం ఆన్లైన్లో అన్ని సేవలను అందిస్తోంది.
టిక్కెట్లను ఆన్లైన్లో ‘yadadritemple.telangana.gov.in’లో బుక్ చేయవచ్చు. ఈ వెబ్సైట్ ద్వారా ఈ -హుండీలో కూడా విరాళాలు ఇవ్వవచ్చు. యాదగిరిగుట్ట దేవస్థానం ఇప్పుడు అతిథులు ఆన్లైన్ బుకింగ్ ద్వారా దర్శనం మరియు పూజా కైంకర్యను ఒక గంట ముందుగానే షెడ్యూల్ చేయడానికి అనుమతిస్తుంది.
ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియలో పేరు, గోత్రం, పూజ వివరాలు, ఫోన్ నంబర్, ఇమెయిల్ చిరునామా, తేదీ, టిక్కెట్ల పరిమాణం, చిరునామా, ఆధార్ నంబర్ మరియు ఆలయ సందర్శన సమయం అన్నీ నమోదు చేయాలి. ఆన్లైన్ బుకింగ్, కౌంటర్లో కంప్యూటరైజ్డ్ టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులు తూర్పు రాజగోపురం వద్ద టిక్కెట్లపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆలయంలోకి ప్రవేశించవచ్చని ఆలయ ఈఓ భాస్కరరావు తెలిపారు.