Liquor Shops Close : మద్యం ప్రియులు వరుసగా షాక్‌లు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్‌లో రెండు రోజులు, మేలో నాలుగు రోజులు మూతపడిన మద్యం దుకాణాలు మరోసారి మూతపడనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మంగళవారం అనగా ఈరోజు లోక్ సభ ఎన్నికల ఫలితాలు (Lok Sabha election results) వెలువడనున్నాయి. నేడు జరగనున్న ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టింది.
హైదరాబాద్‌లోని మద్యం దుకాణాలను మూసివేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి జూన్ 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు నగరంలోని మద్యం దుకాణాలు, టావెర్న్‌లు, రెస్టారెంట్లు (Restaurants) మూసి వేయాలని చెప్పారు. ఎవరైనా అక్రమంగా మద్యం ఉంచి విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
144 సెక్షన్‌ను కూడా అమలు చేసి, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా చర్యలను చేపట్టారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఐదుగురి కంటే ఎక్కువ మంది వ్యక్తులు గుంపులుగా ఉన్నా, సమావేశాలు మరియు ర్యాలీలపై ఆంక్షలు కూడా జూన్ 5 వరకు అమలులో ఉంటాయి.
కౌంటింగ్ ప్రక్రియ (counting process) సజావుగా మరియు సురక్షితంగా జరిగేలా కఠినమైన చర్యలు తీసుకున్నారు. ఎక్కడా ఎలాంటి అనుకోని సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ సంఖ్యలో పోలీసులను ఉంచారు.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో గత నెల 13వ తేదీన లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుండగా.. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం అనుమతులు ఉన్న ఆయా పార్టీలకు చెందిన సిబ్బంది, అభ్యర్థుల ఏజెంట్లు, మీడియా ప్రతినిధులకు మాత్రమే కౌంటింగ్ కేంద్రాలను సందర్శించేందుకు అనుమతి ఉంది.