18 సంవత్సరాల క్రితం చంద్రునిపై భూమిని కొన్న కృష్ణా జిల్లా వాసి
భూముల అమ్మకాలు ఇప్పుడు చంద్రుని మీద కూడా జోరుగా సాగుతున్నాయి. చంద్రయాన్-3 సక్సెస్ కావడం తో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇప్పుడు చంద్రుని పై జరుగుతుంది. కృష్ణా జిల్లా వాసి రెండు ఎకరాలు కొనుగోలు చేసాడు.
Telugu Mirror : రియల్ ఎస్టేట్ (Real Estate) ఎల్లలు దాటి నింగికి చేరుకుంది. చంద్రుడి మీద కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. భారత్ చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతం కావడంతో ఇప్పుడు ప్రపంచం చూపు ఇప్పుడు చంద్రుడిపై పడింది. భవిష్యత్ లో చంద్రుని మీద నివాసం ఉండటానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే అక్కడ సెటిల్ అవ్వడానికి ముందుగానే భూమిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో క్రమేపీ చంద్రుని మీద స్థలం కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చంద్రుని పై స్థలం కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఎన్నారై తన ఇద్దరు కుమార్తెలకు చంద్రుని మీద భూమిని కొనుగోలు చేశారు.
చంద్రుని పై భూమిని కొన్న ఎన్నారై (NRI) :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామానికి చెందిన ఎన్నారై బొడ్డు జగన్నాథరావు తన కుమార్తెలు మానస, కార్తీక పేరిట చంద్రుడిపై భూమి కొన్నారు. ఆయన తన కుమార్తెల కోసం రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. న్యూయార్క్‌లోని లూనార్ రిపబ్లిక్ సొసైటీ ఆఫీసు (Lunar Republic Society Office) కు స్వయంగా తన కుమార్తెలతో పాటు వెళ్లిన ఆయన, వారి పేరిట చెరో ఎకరం భూమి కొనుగోలు చేసినారు. జగన్నాథరావు ఉద్యోగ రీత్యా న్యూయార్క్ (New York) లో స్థిరపడి పోయారు. 2005లో ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ గురించి తెలుసుకుని చంద్రునిపై ఈ సంస్ధ నుంచి భూమి కొనుగోలు చేశాడు.
18 ఏళ్ల క్రితమే చంద్రుడిపై తన కుమార్తెల పేరిట చెరో ఎకరం భూమి కొనుగోలు చేసినట్లు స్వయంగా ఆయన వెల్లడించారు. అక్షాంశాలు, రేఖాంశాల మధ్య భూమిని కొన్నట్లు సరిగ్గా ప్రదేశంతో సహా జగన్నాథరావు చెప్పడం విశేషం. అయితే లూనార్ ల్యాండ్స్ (Lunar Lands) ఇప్పుడు స్పష్టంగా పేర్కొంటూ జగన్నాథరావుకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రావడంతో జగన్నాథరావు కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రుని మీద కొన్న రెండు ఎకరాల కోసం ఎంత ఖర్చు అయిందనే విషయాలు మాత్రం బయటికి రాలేదు.
ఇదిలా ఉండగా ఇటీవలే తెలంగాణకు చెందిన ఎన్నారై (NRI) సాయి విజ్ఞత అనే మహిళ తన తల్లి మరియు కూతురు పేరుపై చంద్రునిపై ఎకరం భూమి కొనుగోలు చేయగా ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తి కావడం విశేషం.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన సాయి విజ్ఞత తన తల్లి వకుళాదేవి, తన కూతురు ఆర్త సుద్దాల పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గత నెల 23 న డాక్యుమెంట్లు అందాయి. సాయి విజ్ఞత మొత్తంగా చంద్రునిపై ఎకరం స్థలం కొనుగోలు చేసింది. చంద్రుని పైన ఎకరం స్థలం ఇప్పుడు రూ.35 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. అయితే చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధృవం మీద అడుగుపెట్టిన రోజే సాయి విజ్ఞత రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు.
చంద్రుని పై ఎలా కొనాలి?
అయితే చంద్రుడి పైన భూమిని ఎలా కొనాలి,ఎంత రేటుకు కొనాలి, ఎంతవరకూ కొనవచ్చు అనే విషయాలు లూనా సొసైటీ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ కంపెనీలు పూర్తి సమాచారం అందిస్తాయి. గతంలోనే పలువురు హైదరాబాద్, బెంగళూరుకు చెందిన వారు చంద్రునిపై భూమి కొనుగోలు చేసినారు. ఇటీవల తెలంగాణ మహిళ, ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లా వ్యక్తి కొన్నారు. వీరిద్దరూ ఎన్నారైలే. అయితే చంద్రుడి మీద భూమి కొనాలంటే లూనార్ రిజిస్ట్రీ కంపెనీ వెబ్సైట్ (Lunar Registry Company website) లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. డాలర్ల రూపంలో మాత్రమే లావాదేవీలు పూర్తి చేయాల్సి ఉంటుంది.