విమానాల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ తమ లగేజ్ (Luggage) పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనగా విమానాశ్రయంలో సెక్యూరిటీ వాళ్లు చెకింగ్ చాలా పకడ్బందీగా చేస్తారు. అమెరికాలో అయితే మరింత ఎక్కువగా, ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అయితే విమానంలో ప్రయాణించే ప్రయాణికుల లగేజ్ తో పాటు వారి దగ్గర ఉన్న మనీ పర్స్ అలాగే వారి ఒంటి మీద ఉన్న ఆభరణాలు కూడా తీసి వాటిని కూడా ఒక బాక్స్ లో ఉంచే స్కాన్ (Scan) చేయించాల్సి ఉంటుంది. ఎందుకనగా భద్రతాపరమైన అంశం కాబట్టి చెకింగ్ విషయంలో అక్కడ పనిచేసే సిబ్బంది చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు.
అనుమానాస్పదమైన వస్తువులను విమానాశ్రయం లోనికి అనుమతి ఉండదు. అయితే సెక్యూరిటీ చెకింగ్ దగ్గర విమానాశ్రయ సిబ్బంది తమ చేతివాటం కనబరిచారు. ప్రయాణకుల బ్యాగులు మరియు పర్సులో ఉన్న నగదు తో పాటు ఇతర విలువైన వస్తువులను కొల్లగొట్టారు. ఈ సంఘటన అమెరికాలోని మయామి విమానాశ్రయం (Miami airport ) లో జరిగింది. అయితే సిబ్బంది చేసిన ఈ పని అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వడంతో విమానాశ్రయ ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. ఆ వస్తువులను కాజేసిన ఇద్దరు ఉద్యోగులను పోలీసులకు అప్పగించారు.
న్యూయార్క్ పోస్ట్ తెలిపిన ఒక నివేదిక ప్రకారం, మయామి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి చెందిన సిబ్బంది లాబారియాస్ విలియమ్స్ , జోష్ గొంజా లెజ్ ప్రయాణీకుల బ్యాగులనుండి డబ్బు మరియు ఇతర వస్తువులను దొంగిలించడం సీసీటీవీ ఫుటేజీలలో కనిపించింది.
ప్రస్తుతం ఈ దొంగతనానికి సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్ (Viral) అయింది. ఈ సంవత్సరం జూన్ 29న మయామి విమానాశ్రయంలో ప్రయాణీకులు తమ లగేజ్ ను సెక్యూరిటీ స్కాన్ కోసం మిషన్ పై పెట్టగా అక్కడ డ్యూటీలో ఉన్న ట్రాన్స్ పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగస్తులు ఇద్దరూ వాటిని స్కానింగ్ మిషన్ లోకి పంపిస్తున్నారు.
ఆ సమయంలో ఒక ప్రయాణికుడి లగేజ్ లో ఉన్న పర్స్ లో నుండి 600 డాలర్ల (Dollars) ను, వేరొక ప్రయాణికుడి లగేజ్ లో నుండి నగదు దొంగిలించారు. పోలీసులు విచారణ చేయగా వారు ఏమని చెప్పారంటే ఇద్దరం కలిసి రోజుకు సుమారుగా 1000 డాలర్ల వరకు తీస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించి ఇంకా విచారణ జరుగుతుందని పోలీసులు తెలియజేశారు.