AP Government : ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి టీడీపీ కూటమి ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధి, మెరుగుదల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా విమానయాన సేవలను నగరాలతో అనుసంధానం చేసేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఏపీలో నాలుగు అదనపు విమానాశ్రయాలను (Airports) నిర్మించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ విషయాన్ని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ఈ కోణంలో, అతను ట్విట్టర్‌ను (Twitter) ప్లాట్‌ఫారమ్‌గా ఉపయోగించి ఈ విషయాన్నీ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ట్విన్ ఇంజన్ ప్రభుత్వ దార్శనికత ఫలితంగా ఏపీలో నాలుగు కొత్త విమానాశ్రయాలను నిర్మించబోతున్నామని సత్యకుమార్ ట్వీట్ చేశారు.
చిత్తూరు జిల్లా కుప్పం, నెల్లూరులోని దగదర్తి, గుంటూరులోని నాగార్జునసాగర్, శ్రీకాకుళంలోని మూల్‌పేటలో విమానాశ్రయాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విమానాశ్రయాల నిర్మాణం వల్ల మౌలిక సదుపాయాల అభివృద్ధి, కనెక్టివిటీ, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
మరోవైపు ఇటీవల ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను సందర్శించిన అనంతరం.. దానికి సమాంతరంగా ఐదారు విమానాశ్రయాలను అదనంగా నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు. దొనకొండ, దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్‌తో పాటు భోగాపురంలో విమానాశ్రయాలు నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీకి (TDP) చెందిన శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి పెద్ద ఎత్తున సహాయం అందుతోంది. దీపం ఉండగానేన ఇళ్ళు చక్కదిద్దుకోవాలి అని పెద్దలు అన్నట్టుగా మంత్రివర్గం తమ ఆధీనంలో ఉన్నప్పుడే రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
ఇందులో భాగంగా మరో నాలుగు విమానాశ్రయాలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం కూడా 2026 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు.