Sukanya Samriddhi Yojana : ఒకప్పుడు ఆడ పిల్ల పుట్టిందంటే చాలు చాలా ఘోరంగా చూసేవారు. ఆ తర్వాత కాలం మారుతూ వస్తోంది. ఇప్పుడిప్పుడే తల్లిదండ్రుల్లో మార్పు వస్తోంది. కొడుకైనా, కూతురైనా ఒకటే అని అనుకుంటున్నారు. అయితే కుమార్తె ఉన్నావారు, వారి చదువు, పెళ్లి కోసం ఎంతో కొంత కూడబెట్టాలి. ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana)పథకం తీసుకొచ్చింది.
ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు ఎంతోకొంత ఈ కేంద్ర ప్రభుత్వ పథకం సుకన్య సమృద్ధి స్కీం గురించి అవగాహన ఉండే ఉంటుంది. పన్ను రాయితీ, వడ్డీ, దీర్ఘకాల పొదుపు సదుపాయం, స్వల్ప మొత్తాల్లో కూడా పెట్టుబడి వంటివి ఈ పథకంలో ఉన్న ప్రయోజనాలు. తాజాగా ఈ స్కీంకు 8.2 శాతం వడ్డీని (Interest) ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించారు.
సురక్షితమైన పెట్టుబడులు, ఆడపిల్లల భవిష్యత్తుకు (Future Of Girls) పెద్దపీట వేసేవారికి సుకన్య సమృద్ధి స్కీం (SSY) సరైనది. నెలకు రూ.12,500 పెట్టుబడి (ఏటా రూ.1.5 లక్షలు)తో 8 శాతానికి పైగా వడ్డీ అందితే ఆఖర్లో రూ.70 లక్షల వరకు అందుకునే సౌకర్యం ఈ పథకంలో ఉన్నది. ఇంతకీ ఈ పథకంలోని లాభాలు ఏమిటి? ఏ మేరకు ఇన్వెస్ట్ చేయవచ్చు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరు అర్హులు?
- భారతీయులై ఉండాలి.
- ఆడపిల్లల తల్లిదండ్రులు లేదా గార్డియన్‌లకు మాత్రమే అర్హత ఉంటుంది.
- అమ్మాయి వయసు పదేండ్లు నిండేలోగానే స్కీం తీసుకోవాల్సి ఉంటుంది.
- ఒక్కరికి ఒక్క ఖాతానే తెరుస్తారు.
- కుటుంబంలో గరిష్ఠంగా ఇద్దరికి మాత్రమే స్కీం వర్తిస్తుంది.
అవసరానికి నగదు తీసుకోవచ్చా?
రెగ్యులర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD), రికరింగ్ డిపాజిట్ (RD), ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం (ELSS) తరహాలో కాకుండా ఇందులో నగదు ఉపసంహరణ కాస్త భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పథకం ప్రధాన ఉద్దేశమే ఆడపిల్ల పెండ్లి, చదువుకు పైసలు అందిరావడం. అందుకే పథకం ప్రారంభించిన 21 సంవత్సరాలకే మెచ్యూరిటీ ఉంటుంది.
కానీ ఖాతా ప్రారంభించిన 15 ఏండ్లదాకా మీరు నగదును జమ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 6 ఏండ్లపాటు ఎలాంటి పెట్టుబడి లేకపోయినా వడ్డీ జమవుతూ ఉంటుంది. అమ్మాయికి 18 ఏండ్లు దాటిన తర్వాత, ఆమె పెండ్లికి అవసరమైనప్పుడు ఈ నిధులను ఉపసంహరించుకునే వీలున్నది. అంతేగాక జమైన కార్పస్ మొత్తంలో 50 శాతం వరకూ బిడ్డ చదువు కోసం కూడా విత్‌డ్రా చేయవచ్చు.
అయితే ఇందుకు ఆమె వయస్సు 16 ఏండ్లు దాటాలి లేదా కనీసం 10వ తరగతి పాసైనా అవ్వాలి. ఇక సంరక్షకుడో, తల్లిదండ్రులో మరణించినా ఈ నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదా ఖాతాదారు ఏదైనా తీవ్ర వ్యాధి బారినపడినా, మరణించినా కూడా ఈ నిధులను చెల్లిస్తారు. అయితే ఖాతా తెరిచిన 5 ఏండ్ల తర్వాతే వర్తిస్తుంది.
ఖాతా ఎలా తెరవాలి?
పోస్టాఫీసు, ఎంపిక చేసిన బ్యాంకుల్లో మాత్రమే ఈ స్కీం ఖాతాల్ని ఓపెన్ చేయవచ్చు. ఏడాదికి కనిష్ఠంగా రూ.250, గరిష్ఠంగా రూ.1.5 లక్షలదాకా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒకేసారి లేదా వాయిదాల్లో కూడా పెట్టుబడిగా పెట్టే వెసులుబాటు ఉన్నది.
వడ్డీరేటు ఎంత?
ప్రతీ 3 నెలలకోసారి ఈ పథకం వడ్డీరేటును సమీక్షించి ఓ నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వ సెక్యూరిటీల వడ్డీరేట్లలోని హెచ్చుతగ్గుల ఆధారంగా స్వల్ప మార్పులుంటాయి. ఈ ఏడాది జనవరి-మార్చికిగాను 8.2 శాతం వడ్డీరేటును నిర్ణయించారు. గతంలో ఓసారి ఏకంగా 9.2 శాతం వడ్డీనిచ్చారు. ఇప్పటిదాకా కనిష్ఠ స్థాయి 7.6 శాతం.
వడ్డీని ఎలా జమ చేస్తారు?
ప్రతి నెలా 5వ తేదీ నుంచి నెలాఖర్లోగా మీ ఖాతాలో ఉన్న సొమ్ముకు మాత్రమే వడ్డీని లెక్కిస్తారు. ఏటా ఆర్థిక సంవత్సరం ముగిశాకే (మార్చి 31 తర్వాత) ఈ వడ్డీని ఖాతాల్లో జమ చేస్తారు.
పన్ను ప్రయోజనాలు?
ఈ పథకంలో లాభం అంతా పన్ను మినహాయింపులదే. నగదు చెల్లించినా, ఉపసంహరించినా ఎలాంటి పన్నూ ఉండదు. సెక్షన్ 80సి కింద గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ ట్యాక్స్ డిడక్షన్ కోసం క్లెయిం చేసుకోవచ్చు.
ఈ పథకానికి 21 ఏండ్ల సుదీర్ఘ లాకిన్ పీరియడ్ ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ తర్వాత పెద్ద మొత్తంలో సొమ్ము చేతికి రావాలనుకునేవాళ్లకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఇన్వెస్ట్ చేసే వివిధ అసెట్ క్లాసుల్లో కొద్ది మొత్తాలను సేఫ్, సెక్యూర్డ్, మినిమం గ్యారెంటీ రిటర్నుల కోసం కూడా చూడాలి.