Cm Jagan Latest: సీఎం జగన్ పై అక్కడ కావాలని ప్లాన్ చేశారా? ఘటన పై దర్యాప్తు ముమ్మరం.

Cm Jagan Latest

CM Jagan Latest: వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్. జగన్మోహన్ రెడ్డి పై గత రాత్రి రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్న వైసీపీ అధినేత 12 ఏప్రిల్ 2024 రాత్రి విజయవాడలోని సింగ్ నగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో జరిగిన ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పై దాడి జరగటం, ఈ దాడిలో ఆయన ఎడమ కన్ను పై భాగంలో గాయం అవడంతో ఈ దాడిని సీరియస్ గా తీసుకున్నారు రాష్ట్ర పోలీసులు. ఇప్పటికే పలు కోణాల్లో విచారణ ప్రారంభించిన పోలీసులు, రాళ్ల దాడిపై ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. అయితే జరిగిన ఘటనపై ఇప్పటివరకు ఏ విధమైన ఆధారాలు లభ్యం కాలేదు. మరోవైపు ఏకంగా సీఎం పైనే దాడి జరగడంతో ఎలక్షన్ కమిషన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. వెంటనే జరిగిన సంఘటనపై నివేదికలను ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.

కీలకంగా మారిన సీసీ పుటేజీ…

జగన్ పై జరిగిన దాడి కేసులో సీసీ పుటేజీ ఇప్పుడు కీలకంగా మారింది. అయితే పలు వార్తా సంస్థల కధనాల ప్రకారం నిన్న ఉదయమే సీసీ టీవీల కేబుల్ కనెక్షన్ లను తొలగించారని, అదే విధంగా దాడి జరిగిన సమయంలో కరంట్ సరఫరా కూడా లేదని దీనివలన సీసీ కెమేరాల ఫుటేజీ లు దొరకడం లేదని వార్తలు వెలువడుతున్నాయి. సంఘటన జరిగిన పరిసర ప్రాంతాలను క్లూస్ టీమ్ జల్లెడ పడుతన్నది. విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం పరిధిలోని సింగ్‌నగర్‌లో ఉన్న గంగానమ్మ గుడి సమీపంలో సీఎం జగన్ పై ఈ దాడి జరిగింది. దాడి జరిగిన ప్రదేశంలో ఓ ప్రైవేటు స్కూల్‌ ఉంది. దాడి జరిగిన సమయంలో కరెంట్ సరఫరా లేదు. వివేకానంద ప్రైవేట్ స్కూల్ , గంగానమ్మ గుడికి మధ్యలో నుండి రాళ్లు వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.
స్కూల్ ఉన్న ప్రదేశానికి, రోడ్డుకు మధ్యలో పెద్దగా స్థలం లేక పోవడంతో సీఎం జగన్ ఉన్న బస్సుకు ఎడమ వైపు జనం తక్కువగా ఉండటం వలన దాడికి ఇక్కడ నుండే ప్రణాళిక వేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఆధారంగా ముందుగానే నిందితుడు ప్లాన్ చేసి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరెంట్ లేకపోవటం కూడా దాడి చేసిన వారికి కలిసివచ్చిందని అంటున్నారు. ఇదిలావుండగా దాడి జరిగిన ప్రదేశానికి దగ్గరలో ఉన్న సీసీ పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. కొందరు అనుమానితులను ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

భద్రతా లోపం..!

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై దాడిని పలువురు ఖండించారు. జగన్ పై జరిగిన దాడితో భద్రతా వైఫల్యంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. వీవీఐపీల భద్రత విషయంలో రాజీ పడకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టవలసి ఉంటుందని కానీ జగన్ చేస్తున్న బస్సు యాత్రలో కొన్ని భద్రతా పరమైన వైఫల్యాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా సీఎం ప్రయాణిస్తున్న రూట్ లో కరంట్ లేకపోవడం చర్చకు దారితీస్తున్నది. ప్రోటో కాల్ ప్రకారంగా సీఎం పర్యటన చేస్తున్న ప్రాంతాల్లో ఏవిధమైన లోటుపాట్లు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటారు. అయితే ఈ మధ్యనే అనంతపురంలో చెప్పు విసిరిన వంటి ఘటన వెలుగు చూసింది. అది మర్చిపోక ముందే ఇప్పుడు తాజాగా విజయవాడలో రాళ్ల దాడి ఘటనతో సీఎం జగన్ భద్రతను పున:సమీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు గాయపడిన అనంతరం బస్సు లో ప్రాధమిక చికిత్స తీసుకున్న జగన్ ప్రభుత్వ ఆసుపత్రిలో గాయానికి చికిత్స తీసుకున్నారు. సీఎం జగన్ ఎడమ కన్ను పై భాగంలో Y ఆకారంలో గాయం అయినట్లుగా సమాచారం. చికిత్స తరువాత బస్సుయాత్ర రాత్రి బస ప్రాంతంలోనే జగన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ రోజు యాత్రకు బ్రేక్ ప్రకటించారు. తిరిగి యాత్ర పునఃప్రారంభం ఎప్పుడనేది ఇవాళ లేదా రేపు వైసీపీ పార్టీ నుండి ప్రకటన చేస్తారని భావిస్తునారు.

ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు: జగన్ పై దాడిని ఖండించిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ, చంద్రబాబుతో సహా పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలకు చోటు లేదని, ముఖ్యమంత్రి జగన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

Xలో స్పందించిన వైఎస్ షర్మిల

గత కొంత కాలంగా తన అన్న, ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా నడుస్తూ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నియామకమైన జగన్ సోదరి వైఎస్ షర్మిల ఇటీవల రాజకీయంగా పదునైన విమర్శలను వైసీపీ ప్రభుత్వంపై చేస్తూ పర్యటనలు చేస్తున్నారు. తన అన్నను టార్గెట్ చేస్తూ కడప ఎంపీ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న షర్మిల ట్విట్టర్ వేదికగా తన అన్న పై జరిగిన దాడి సంఘటనపై స్పందించారు. Xలో ఆమె ఈ విధంగా ట్వీట్ చేసినారు.
“ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగి ఎడమకంటి పైన గాయం కావటం బాధాకరం, దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం. అలా కాకుండా, ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతిఒక్కరు ఖచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే. జగన్ గారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను” అంటూ షర్మిల ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Cm Jagan Latest

 

 

 

 

 

 

 

 

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in