CTET July 2024 : సెంట్రల్ టీచర్ ఎలిజబిలిటి టెస్ట్ (సీటెట్) రాసే అభ్యర్థులకు సీబిఎస్ఈ ద్వారా ఓ శుభవార్త అందింది. సెంట్రల్ టీచర్ ఎలిజబిలిటి టెస్ట్ (CTET) ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. అయితే ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువును సీబిఎస్ఈ పొడిగించింది. నోటిఫికేషన్ లో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు గడువు ఏప్రిల్ 2వ తేదితో ముగిసింది. అయితే, కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్) రాసే అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంస్థ (సీబీఎస్ఈ) ఈ నిర్ణయిం తీసుకుంది. కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్) కు దరఖాస్తు చేసుకునే గడువును ఏప్రిల్ 5 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు ఒక సువర్ణావకాశమనే చెప్పాలి. కనుక సీటెట్ రాయడానికి అర్హత కలిగి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ వెబ్‌సైట్ https://ctet.nic.in/ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
సెంట్రల్ టీచర్ ఎలిజబిలిటి టెస్ట్ (సీటెట్) ను ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తారు. మొదటిది జూలై సెషన్ లోనూ, రెండవది డిసెంబర్ సెషన్‌లో జరుగుతుంది. ఈ సంవత్సరం జూలై సెషన్ 2024 కు సంబంధించిన ప్రకటనను గత నెలలో విడుదలచేశారు. దేశవ్యాప్తంగా 19 వ ఎడిషన్ సీటెట్ పరీక్షను 136 నగరాల్లో నిర్వహిస్తారు. 20 భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్ధులకు ఈ సంవత్సరం జులై 7వ తేదీన (ఆదివారం) దేశవ్యాప్తంగా సీటెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష పెన్ను పేపర్ విధానంలో (ఆఫ్ లైన్) ఉంటుంది. ఈ పరీక్షను మొత్తం రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. పేపర్-1 ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునేవారికోసం నిర్వహించే పరీక్ష. ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారు పేపర్-2 పరీక్ష రాస్తారు.
సీటెట్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 5వరకు పొడిగింపు.
సీటెట్ పరీక్షలో సాధించిన ఉత్తీర్ణత ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటారు. సీటెట్ పరీక్షలో సాధించిన మార్కులకు జీవితకాలం వ్యాలిడిటీ ఉంటుంది.
పరీక్ష ఫీజు వివరాలు:
ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే జనరల్/ఓబీసీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.1000 ఫీజు చెల్లించాలి. రెండు పేపర్లకయితే రూ.1200 రుసుము చెల్లించాలి. ఇక, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకైతే ఒక పేపర్‌కు రూ.500, రెండు పేపర్లకు రూ.600ల చొప్పున పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్ష సమయాలు:
సీటెట్ పరీక్షను రెండు సెషన్‌లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్ లో పేపర్ 2 ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు పేపర్ 1 పరీక్షను నిర్వహిస్తారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు:
తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, వరంగల్, హైదరాబాద్. కనుక అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 5వ తేది అర్థరాత్రి వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకోగలరు.
CTET July 2024