కొద్దిరోజుల్లో చలికాలం (winter) ప్రారంభమవుతుంది. దీంతో చలికి వేడివేడిగా తినాలని, త్రాగాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. నోటికి రుచిగా, ఆరోగ్యంగా ఉండాలంటే సూప్స్ మంచివి అని అంటున్నారు ఆహార నిపుణులు.
చలికాలంలో శరీరంలో వేడి తగ్గకుండా ఉండాలంటే అల్లం వెల్లుల్లి (Ginger Garlic) సూప్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ సూప్ త్రాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా సీజనల్ గా వచ్చే జ్వరం, జలుబు, దగ్గు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ఈ సూప్ తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి ని పెంచుకోవచ్చు. గొంతు నొప్పి తో బాధపడేవారు కూడా వేడివేడిగా ఈ సూప్ ను తాగడం వల్ల ఉపశమనం (relief) పొందవచ్చు.
దీనిని చాలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడానికి పెద్దగా సమయం కూడా పట్టదు. చలికాలంలో దీనిని సాయంత్రం పూట వేడివేడిగా తాగితే ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. శరీరానికి హాయినిస్తుంది.
Also Read : Garlic Uses : రోజువారీ ఆహారంలో వెల్లుల్లి ప్రయోజనాలు.. తెలిస్తే వదిలి పెట్టరు..
అల్లం వెల్లుల్లి సూప్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం.
అల్లం వెల్లుల్లి సూప్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు :
అల్లం, వెల్లుల్లి, నెయ్యి, కొత్తిమీర, మిరియాల పొడి, క్యారెట్ ముక్కలు, ఉప్పు, కార్న్ ఫ్లోర్, నీళ్లు.
అల్లం వెల్లుల్లి సూప్ తయారీ విధానం :
అల్లం, వెల్లుల్లి ని పొట్టు తీసి రెండింటిని రోట్లో వేసి దంచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిరియాలు (Pepper) కూడా వేసి దంచుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో కార్న్ ఫ్లోర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచుకోవాలి.
సూప్ తయారు చేయడానికి పాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేడెక్కాక, దీంట్లో దంచిన అల్లం వెల్లుల్లిని వేసి చిన్న మంటపై రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుని అందులో ఉప్పు, దంచిన మిరియాలు వేసి కలపాలి.
Also Read : అందమైన చామంతి పూలు ఆరోగ్యానికి కూడా చేస్తాయి ఎంతో మేలు.
ఈ నీటిని మీడియం మంటపై పది నిమిషాల పాటు మరిగించాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో కార్న్ ఫ్లోర్ నీటిని వేసి కలపాలి. కార్న్ ఫ్లోర్ నీటిని వేసి కలిపిన తర్వాత ఇప్పుడు ఈ సూప్ ను మీడియం మంటపై మూడు నిమిషాలు దగ్గర ఉండి కలుపుతూ ఉడికించుకోవాలి.
ఆ తర్వాత కొత్తిమీర (Coriander) వేసి చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా మరియు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందించే అల్లం వెల్లుల్లి సూప్ సిద్ధం అయ్యింది.
దీనిని చలికాలం మరియు వర్షం పడే సమయంలో తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.