GT vs PBKS: కళ్ళు చెదిరే బ్యాటింగ్ తో పంజాబ్ కింగ్స్ ను గెలిపించిన శశాంక్ సింగ్,అశుతోష్..వృధా అయిన గిల్ మెరుపులు. గుజరాత్ పై పంజాబ్ విజయం
GT vs PBKS: గుజరాత్ టైటాన్స్ కు పంజాబ్ కింగ్స్ భారీ షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో గుజరాత్ సొంత గడ్డ పై జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ గుజరాత్ పై 3వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గిల్ విజృంభణతో గుజరాత్ విధించిన 200 పరుగుల భారీ లక్ష్యాన్ని శశాంక్ సింగ్ మెరుపులతో పంజాబ్ అధిగమించి విజయాన్ని సొంతం చేసుకుంది.
GT vs PBKS: ఐపీఎల్ 2024లో మరో మెరుపు ఇన్నింగ్స్ నమోదయింది. గురువారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో 200 పరుగుల భారీ లక్ష్యాన్ని చేజ్ చేసే క్రమంలో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్ మెన్ కళ్ళు చెదిరే ఇన్నింగ్స్ తో పంజాబ్ ని గెలిపించారు. అయితే పంజాబ్ టీమ్ లోని స్టార్ బ్యాటర్లందరూ పెవిలియన్ కు క్యూ కట్టగా. యువ క్రికెటర్లు శశాంక్ సింగ్ (29 బంతుల్లో 61), అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31) లు గుజరాత్ పై పంజాబ్ కు మూడు వికెట్ల తేడాతో ఊహకందని విజయాన్ని అందించారు.
బ్యాట్ తో అద్భుతం చేసిన శశాంక్ సింగ్
గుజరాత్ టైటాన్స్ విధించిన 200 రన్స్ టార్గెట్ చేజింగ్ లో పంజాబ్ కింగ్స్ 70 పరుగులకే 4 ప్రధాన వికెట్లు కోల్పోయిన దశలో ఆ టీమ్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ యువ క్రికెటర్ శశాంక్ సింగ్ మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఎక్కడా వెనక్కి తగ్గకుండా తన పోరాటాన్ని కొనసాగించాడు. భారీ షాట్లతో గుజరాత్ బౌలర్లను బెంబేలెత్తిస్తూ తన పోరాటాన్ని కొనసాగిస్తూ జట్టుని విజయతీరాలకు చేర్చాడు. శశాంక్ సింగ్ కి తోడుగా ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ కి దిగిన అశుతోష్ శర్మ కూడా అతనికి చక్కని సహకారం అందించి పంజాబ్ టీమ్ విజయం సాధించడంలో భాగస్వామి అయ్యాడు.
అయితే లాస్ట్ ఓవర్ లో అశుతోష్ ఔట్ అవగా చివరి ఓవర్ నాలుగో బంతిని ఫోర్ గా మలచిన శశాంక్ సింగ్ పంజాబ్ విజయాన్ని ఖాయం చేశాడు. మరో బంతి మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి 200 పరుగుల విజయ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ జట్టు సాధించింది. శశాంక్ సింగ్ మెరుపు వేగంతో 29 బంతుల్లోనే 61 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. మరోవైపు అశుతోష్ 3 ఫోర్లు, ఒక సిక్స్ తో 17 బంతుల్లో 31రన్స్ సాధించాడు.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ శిఖర్ ధావన్ (1), బెయిర్ స్టో (22),సామ్ కరన్ (5), సికందర్ రజా (15)లు లక్ష్య ఛేధనలో ఫెయిలయ్యారు.
చుక్కలు చూపించిన గిల్ ఇన్నింగ్స్
అంతకుముందు గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ గా వచ్చిన శుభ్మన్ గిల్ ఓపెనర్ గా వచ్చి చివరి బంతి వరకూ క్రీజులో నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజ్ లో ఉన్న గిల్ 48 బంతుల్లో 89 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. గిల్ ఆడిన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ లో గిల్ ఆడిన ప్రతి షాట్ కళ్లు జిగేల్ మనేలా ఉన్నాయి. గుజరాత్ ఇన్నింగ్స్ లో ఒక్కో బ్యాట్స్ మెన్ క్రీజులోకి వచ్చి వెళ్తుంటే, గిల్ మాత్రం ఇన్నింగ్స్ భారాన్ని మొత్తం తన భుజాలపై వేసుకొని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
చివర్లో వచ్చిన తెవాతియా సుడిగాలి ఇన్నింగ్స్ తో కేవలం 8 బంతుల్లో 23 రన్స్ చేయడంతో గుజరాత్ టైటన్స్ టీమ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. హర్షల్ పటేల్, కగిసో రబాడా తమ 4 ఓవర్ల కోటాలో చెరో 44 పరుగులు ఇవ్వడం విశేషం. మరో వైపు హర్ప్రీత్ బ్రార్, అర్ష్దీప్ సింగ్ చెరో 33 పరుగులు ఇచ్చారు.
ముందుగా ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటన్స్ తరఫున వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. గుజరాత్ కు ఈ ఇద్దరు ఓపెనర్లు మెరుపు ఆరంభం ఇచ్చారు అయితే జట్టు స్కోరు 29 పరుగుల దగ్గర ఉండగా సాహా (11) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి కేన్ విలియమ్సన్ వచ్చాడు. గత ఏడాది గాయంతో ఐపీఎల్ కు దూరమైన విలియమ్సన్ మళ్ళీ ఐపీఎల్ లో అడుగు పెట్టాడు. బ్యాటింగ్ లో మంచి టచ్ లో ఉన్న విలియమ్సన్ మొదట్లో నెమ్మదిగా ఉన్నా ఆ తరువాత తన బ్యాటింగ్ జోరు పెంచాడు. ఓవైపు శుభ్మన్ గిల్ బ్యాట్ ఝుళిపిస్తుంటే విలియమ్సన్ అతనికి చక్కని సహకారం అందించాడు. 22 బంతుల్లోనే 4 ఫోర్లతో 26 పరుగులు చేసి విలియమ్సన్ పెవిలియన్ కు చేరాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన సాయిసుదర్శన్, వచ్చీ రాగానే తనదైన శైలిలో బౌలర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు.
వరుస బౌండరీలతో చెలరేగిన సుదర్శన్ 19 బంతుల్లో 33 రన్స్ చేశాడు. గిల్ తో కలిసి మూడో వికెట్ కు 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తర్వాత వచ్చిన విజయ్ శంకర్ (8) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అయితే ఇన్నింగ్స్ చివర్లో వచ్చిన రాహుల్ తెవాతియా మ్యాచ్ ను తనదైన స్టైల్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చి ముగించాడు. జెట్ వేగంతో అతడు కేవలం 8 బంతుల్లోనే 23 రన్స్ చేశాడు. తెవాతియా ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.
Comments are closed.