Telugu Mirror: బుధవారం సాయంత్రం దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన చంద్రయాన్ -3 (Chandrayaan-3) అంతరిక్ష నౌక ‘ల్యాండర్ విక్రమ్’ (Lander Vikram) విజయ వంతంగా చంద్రునిపై కాలుమోపింది. ప్రపంచం అంతా భారత దేశం వైపు చూసేలా సగర్వంగా ఎట్టకేలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేసిన ఘనత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు దక్కింది. ప్రపంచంలోనే చంద్రుడి దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకను దింపిన మొదటి దేశంగా భారత్ అవతరించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తల అవిరామర కృషి ఫలించింది. నాలుగేళ్ళ క్రింద ప్రయోగించిన చంద్రయాన్ 2 మిషన్ చివరి క్షణంలో జరిగిన వైఫల్యాన్ని చంద్రయాన్ 3ని విజయ వంతంగా ప్రయోగించడం ద్వారా భారత శాస్త్రవేత్తల బృందం అధిగమించింది.
చంద్రునిపైకి ఇస్రో పంపిన చంద్రయాన్-3 భారత అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేసే ముఖ్య ఘట్టం ఈరోజు సాయంత్రం 6:04 గంటలకు ముగిసింది. చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర స్పేస్ క్రాఫ్ట్ ను దింపిన ప్రపంచంలోనే మొదటి దేశంగా భారత్ నిలిచింది. అంతరిక్ష నౌక చంద్ర యాన్ ను ప్రయోగించినప్పటి నుండి చంద్రయాన్ ల్యాండింగ్ విజయవంతమవుతుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రగాఢ విశ్వాసాన్ని కలిగి ఉంది.
ఇస్రో జూలై 14న ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రములోని సతీష్ ధావన్ లాంచ్ సెంటర్ శ్రీహరి కోట నుంచి చంద్రయాన్ 3ని ప్రయోగించింది. ఆ తర్వాత ఈరోజు వరకు అంటే ఆగస్టు 23 వరకు భారత్ అన్ని దశలలో విజయం సాధించింది. ఈసారి ఇస్రో శాస్త్రవేత్తల బృందం ఆర్బిటర్‌ను పంపకుండా ప్రొపల్షన్ మాడ్యూల్‌ను పంపింది. వారు ఊహించిన దానికంటే ఎక్కువ ఇంధనం కూడా మిగిలింది. ఈ ఇంధనాన్ని ఉపయోగించి, మాడ్యూల్ భూమిని అధ్యయనం చేయడానికి కనీసం రాబోయే ఆరు నెలల పాటు చంద్రుని చుట్టూ తిరుగుతుంది.
నాలుగు సంవత్సరాల క్రితం భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 2 మిషన్ విఫలమైన తర్వాత, ఆ వైఫల్యాల నుండి ఇస్రో శాస్త్ర వేత్తల ద్వారా చంద్రయాన్ 3 మిషన్ సవరించబడింది. చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రదేశాన్ని ఎంచుకునే అవకాశం కూడా ఇవ్వబడింది. దీంతో పాటు చంద్రయాన్ మిషన్‌లో పాల్గొన్న ఇస్రో శాస్త్రవేత్తలు కూడా చంద్రయాన్-3 మిషన్ విజయవంతమవుతుందని తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ప్రపంచ దేశాల చూపు భారత దేశం వైపు చూసేలా చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) తో సహా పలువురు ప్రముఖులు అలాగే దేశ ప్రజలు ప్రశంశలు కురిపించారు.