Cricket God Sachin: ‘ క్రికెట్ దేవుడి ‘ యుగం ప్రారంభమైన రోజు.. ఇప్పటి వరకు అందనంత ఎత్తులో నిలిచిన సచిన్ టెండూల్కర్.

Telugu Mirror: ఇప్పటి వరకు ప్రపంచ క్రికెట్ లో ఎంతోమంది ఆటగాళ్లు వచ్చారు, వెళ్ళారు. కానీ కొంతమంది మాత్రమే ఇప్పటికీ క్రికెట్ ప్రపంచంలో తమదైన ముద్ర వేసి చెరగని గుర్తుగా నిలిచారు. అలా నిలిచిన దిగ్గజ క్రికెటర్లకు కూడా అందనంత ఎత్తులో నిలిచిన వాడు దేవుడు. అతనే ప్రపంచ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar). క్రికెట్ ను విశ్వ వ్యాపితం చేయడంలో సచిన్ పాత్ర సైతం కీలకం. దేశమేదైనా కూడా క్రికెట్ ఆడాలని బ్యాట్ పట్టుకొనే ప్రతి ఒక్కరికీ ఆదర్శం, స్ఫూర్తి సచిన్ టెండూల్కర్. క్రికెట్ ప్రపంచంలో తన దైన ముద్ర వేయడానికి నాంది పలికిన రోజు ఇదే రోజు. సరిగ్గా 33సంవత్సరాల క్రితం ఇదే రోజున అంతర్జాతీయ క్రికెట్ లో తన తొలి సెంచరీని సాధించడం ద్వారా ప్రపంచ క్రికెట్ కు తాను వచ్చాననే సందేశాన్ని పంపాడు.1990 లో ఓల్డ్ ట్రాఫోర్డ్ లో ఇదే రోజున (ఆగష్టు 14) ఇంగ్లాండ్(England)తో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ లో భారత్ ను ఓటమి నుండి కాపాడే దిశగా సాగిన బ్యాటింగ్ లో 17 ఏళ్ళ సచిన్ టెండూల్కర్ 189 బంతుల్లో 17 ఫోర్లతో 119 పరుగులతో చేయటం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో తన తొలి శతకం ని నమోదు చేసుకున్నాడు. మ్యాచ్ డ్రా గా ముగిసినా కానీ ఈ సెంచరీతో భవిష్యత్ ‘క్రికెట్ దేవుడి’ గా ఎదిగే క్రమంలో తన మార్గాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రపంచ క్రికెట్ లో ఈ ఇన్నింగ్స్ ద్వారానే క్రికెట్ చరిత్ర లోనే కొత్త యుగం ప్రారంభం అయిందని చెప్పవచ్చు.

 

ఈ క్రమంలోనే 33 ఏళ్ళ క్రితం సచిన్ చేసిన తొలి సెంచరీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గుర్తుచేసుకున్నది. బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ సంఘటనను గుర్తు చేస్తూ ట్వీట్ చేశాడు. 1990 లో ఇదే రోజు సచిన్ మ్యాచ్ సేవింగ్ ఇన్నింగ్స్ ద్వారా తన తొలి అంతర్జాతీయ సెంచరీని సాధించాడని. ప్రపంచ వేదికపై తనను తాను పరిచయం చేసుకున్నాడని, ఈ సెంచరీ ఒక నూతన శకానికి నాంది పలికింది అని జై షా తన ట్వీట్ లో పేర్కొన్నాడు. సచిన్ అభిమానులు కూడా ఈ రోజు సచిన్ తొలి శతకం ని గుర్తు చేసుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు.

Image Credit: Sportsstar – Thehindu

1989 లో 16 ఏళ్ళ వయస్సులోఅంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఈ ముంబై(Mumbai)కుర్రాడు ఆడిన ప్రతి దేశం పై శతకాలతో చెలరేగి టన్నుల కొద్దీ పరుగులను సాధించాడు. 2013 లో క్రికెట్ నుండి రిటైర్ అయ్యే వరకు టెస్టుల్లో 51 సెంచరీలు,68 హాఫ్ సెంచరీలు సాధించి ,53.78 సగటుతో 15,921పరుగులు చేశాడు. వన్డే క్రికెట్ లో 44.83 సగటు కలిగి, 86.23 స్ట్రైక్ రేట్ తో 49 సెంచరీలు,96 ఆర్ధ సెంచరీలతో 18,426 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్ లో తొలి డబుల్ సెంచరీ (200*) చేసిన తొలి క్రికెటర్ సచిన్.

రెండు ఫార్మాట్ లలో కలిపి 100 సెంచరీలు,164 హాఫ్ సెంచరీలు సాధించి 34,357 పరుగులు సాధించి అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 100 సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ సచిన్ టెండూల్కర్.

ఇప్పటికీ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ప్రపంచ క్రికెట్ లో ప్రతి ఒక్క స్టార్ ప్లేయర్ సచిన్ రికార్డ్ లను అధిగమించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారంటే.. అర్థం చేసుకోవచ్చు సచిన్ ఎంత సాధించాడో..

ముద్దుగా ముంబైకర్ అని పిలుచుకునే సచిన్ టెండూల్కర్ నిజంగానే “గాడ్ ఆఫ్ క్రికెట్(God Of Cricket).”

Leave A Reply

Your email address will not be published.