Telugu Mirror : రాష్ట్రం లోని ఎనిమిది జిల్లాలలో 8 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు దూరధృష్టి లో భాగంగా జిల్లాకో మెడికల్ కాలేజ్ ఉండాలి అనే విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం కొత్తగా 8 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం వలన తెలంగాణలో 800 MBBS సీట్లు పెరుగుతాయి.
సమాచారం మేరకు ఈ వైద్య కళాశాలలు మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లు 100 MBBS సీట్లను కలిగి ఉంటాయి.
నూతనంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మెదక్ జిల్లా మెదక్ లో, యాదాద్రి భోనగిరి జిల్లాలోని యాదాద్రిలో, వరంగల్ జిల్లా నర్సంపేట, ములుగు జిల్లా లోని ములుగు, నారాయణపేట జిల్లా నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలోని గద్వాల్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోని కుత్బుల్లాపూర్ లో వైద్య కళాశాలలు ప్రారంభించనున్నారు.
తెలంగాణ MBBS సీట్లు , నీట్ కౌన్సిలింగ్ కొత్తగా మంజూరైన వైద్య కళాశాలల ద్వారా ఇప్పటికి ఉన్న మెడికల్ సీట్లకు అదనంగా 800MBBS సీట్లు తెలంగాణలో పెరగనున్నాయి.
పెరిగిన సీట్లను NEET UG ఆధారంగా నీట్ లో అర్హత సాధించిన అభ్యర్ధులకు నిర్వహించే కౌన్సిలింగ్ ద్వారా మెడికల్ అభ్యర్ధులు అడ్మిషన్ లు పొందుతారు.
నిభంధనలను అనుసరించి, ఈ మెడికల్ సీట్ల లో 85 శాతం సీట్లకు అడ్మిషన్ లను కాళోజీ నారాయణ రావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (KNRUHS ) ద్వారా జరిగే నీట్ రాష్ట్ర కౌన్సిలింగ్ లో కేటాయిస్తారు. AIQ (All India Quota, AIQ) క్రింద మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఆధ్వర్యంలో మిగతా 15 శాతం మెడిసిన్ సీట్లకు అడ్మిషన్ లను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నిర్వహిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు మాట్లాడుతూ భారత దేశంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో కొత్తగా కేటాయించిన MBBS సీట్లలో 43శాతం తెలంగాణ లోనే ఉన్నాయని తెలిపారు.
2023 – 24 విద్యా సంవత్సరంలో భారత దేశ వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పెరిగినటువంటి 2118 MBBS సీట్లలో తెలంగాణ కు చెందిన మెడికల్ సీట్లు 900 ఉన్నాయని హరీష్ రావు తెలిపారు.