Outstanding RCB vs RR Match IPL 2024 : స్వదేశంలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది. ఆర్సీబీ (RCB) నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే సాధించింది. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ (Jose Butler) సెంచరీతో చెలరేగాడు. 58 బంతుల్లో 9 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 100 పరుగులు చేశాడు.
టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), డుప్లెసిస్ శుభారంభం అందించారు. ముఖ్యంగా కోహ్లీ రాజస్థాన్ బౌలర్లను చిత్తు చేశాడు. వచ్చిన బంతిని బౌండరీకి తరలించాడు. మరోవైపు డుప్లెసిస్ రాణించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
కోహ్లి సెంచరీతో చెలరేగాడు.
తర్వాత వచ్చిన మాక్స్‌వెల్ (Maxwell), సౌరవ్ చౌహాన్‌లు ఇద్దరూ స్వల్పంగా పరుగులు చేశారు. మరోవైపు కోహ్లి చివరి వరకు దూకుడుగా నిలిచి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో కోహ్లీ సెంచరీ చేశాడు. ఈ సీజన్‌లో కోహ్లి తొలి సెంచరీ ప్లేయర్‌గా నిలిచాడు. దీంతో ఐపీఎల్‌లో (IPL) విరాట్‌కి ఇది ఎనిమిదో సెంచరీ. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. చివరి వరకు అజేయంగా నిలిచిన కోహ్లి 72 బంతుల్లో 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 113 పరుగులు చేశాడు. చాహల్ రెండు వికెట్లు తీశాడు.
దంచి కొట్టిన బట్లర్, సంజూ.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్‌కు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని యశస్వి జైస్వాల్ (Yashaswi Jaiswal) ఈ మ్యాచ్ లో కూడా డకౌట్ అయ్యాడు. జైస్వాల్ ను టోప్లే ఔట్ చేశాడు.
మరో ఓపెనర్ జోస్ బట్లర్ తో కలిసి కెప్టెన్ సంజూ శాంసన్ ఆర్సీబీ (RCB) బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని సిరాజ్ విడదీశాడు. మాంచి ఊపుమీదున్న శాంసన్ ను ఔట్ చేసి ఆర్సీబీకి బ్రేక్ ఇచ్చాడు. 42 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 69 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి దిగిన రియాన్ నాలుగు పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో 155 పరుగుల వద్ద రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. తర్వాత, జురెల్ కూడా రెండు పరుగులకే ఔటయ్యాడు. బట్లర్ మరియు హెట్‌మైర్ కలిసి మిగిలిన వాటిని పూర్తి చేశారు. జోస్ బట్లర్ సిక్స్ తో సెంచరీ పూర్తి చేయడమే కాకుండా జట్టును విజయతీరాలకు చేర్చాడు. రాజస్థాన్ 189 పరుగులు చేసి 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయింది.