Rain Fall in Telugu States: ఎట్టకేలకు సూర్యుడు శాంతించాడు. ఎండలు మరియు వేడిగాలులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్ (April) చివరి వారం, మే (May) మొదటి వారం భానుడు వీర ప్రతాపం చూపించాడు. ఇంట్లో ఉంటే ఉక్కపోత, బయటకు వెళితే వడదెబ్బ. దీంతో ప్రజలు ఎండలను భరించలేక తల్లిడిల్లిపోయారు. కానీ, మొన్న వర్షాలు పడినప్పటి నుంచి సూర్యుడు శాంతించాడు. హీట్ వేవ్ తగ్గడంతో హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది.
ఈ నేపథ్యం లో రానున్న ఏడు రోజుల పాటు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని భారత వాతావరణ శాఖ చల్లని కబురు తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులు కూడా వస్తాయి. గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి.
ఈ ఉదయం గుంటూరు (Guntur) లో జల్లులు కురిసే అవకాశం ఉందని శాటిలైట్ ప్రెసిపిటేషన్ (Satellite Precepitation) అంచనా వేసింది. ఉత్తరాంధ్ర మినహా అన్ని చోట్లా మబ్బులు కమ్ముకుంటాయి. తూర్పు తెలంగాణలో మేఘాలు కమ్ముకుంటాయి. రోజంతా మేఘాలు కనిపిస్తాయి మరియు అదృశ్యమవుతాయి.
అయితే ఈ మేఘాలు తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత హైదరాబాద్ (Hyderabad) లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాత్రి 10 గంటల తర్వాత ఏపీ (AP) , తెలంగాణ (Telangana) వ్యాప్తంగా మేఘాలు కమ్ముకుంటాయి. పశ్చిమ రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 10 నుంచి 13 కిలోమీటర్లుగా ఉంది. గాలి డైరెక్టుగా ఏపీలోకి వస్తోంది. ఏపీలో గాలి వేగం గంటకు 8 నుంచి 15 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణలో 4 నుంచి 7 కిలోమీటర్లుగా ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో సాయంత్రం తర్వాత గాలి వేగం పెరుగుతుంది. తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రత 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రత 32 నుంచి 39 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
ఉత్తర ఆంధ్రప్రదేశ్, తూర్పు తెలంగాణలో నేడు కొంత తేమ ఉంది. సాయంత్రం వర్షం పడే అవకాశం ఉంది. మొత్తంమీద ఈ రోజంతా మేఘావృతమై ఉంటుంది కాబట్టి కాస్త ఉపశమనం లభిస్తుంది.