Telangana Cabinet Meeting 2024 తెలంగాణ సర్కార్ నేడు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపించడం వలన ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది.
ఇచ్చిన హామీలను అమలు చేయడం..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ఇప్పటికే పలు పథకాలను అమలు చేసింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ కింద రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు పెంచారు. తాజాగా, గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంట్, కేవలం రూ. 500లకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు కూడా అమలు చేశారు. ఇచ్చిన ఆరు హామీలను 100 రోజుల్లో పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్పుకొచ్చారు. మిగిలిన పథకాల అమలు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
నేడు మంత్రివర్గ సమావేశం..
నేడు 12 గంటలకు బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహిస్తున్న ఈ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక పంటల బీమాను కూడా వచ్చే వర్షాకాలం నుండి అమలు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై కూడా మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. రైతుభరోసా పథకంలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అనే విషయంపై కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు..
ఇచ్చిన హామీల్లో భాగంగా పలు పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
- మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం అందించే విషయంపై చర్చించే అవకాశం ఉంది.
- మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే అంశంపై కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.
- రేషన్ కార్డు దరఖాస్తులు అధికంగా వచ్చిన నేపథ్యంలో. ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.
- 2008 డీఎస్సి బాధితులకు న్యాయం జరిపించే దిశగా కీలకం నిర్ణయం.
- గతంలో గవర్నర్ కోటాలో చేసిన ఎంఎల్సీ నియామకం అనే అంశంపై తాము చేసిన సిఫారసులపై మళ్ళీ పరిశీలించాలని గవర్నర్ ని కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
- 11 కొత్త బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు అంశంపై కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
- ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించిన డీఏపై కూడా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
- పాఠశాలలు, కళాశాలల అభివృద్ధి మరియు వాటికి ఉచితంగా విద్యుత్ కల్పించే వాటిపై కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
Telangana Cabinet Meeting 2024