Telugu Mirror : దేశ వ్యాప్తంగా భారత దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఊరూ, వాడా, జాతి, కుల మత భేదం లేకుండా దేశమంతటా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి(Narendra Modi) ఎర్ర కోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే వివిధ రాష్ట్రాలలో రాష్ట్ర ముఖ్యమంత్రులు జాతీయ జెండాను ఎగురవేశారు.
ఇక తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర రావు(KCR) హైదరాబాద్ లో గోల్కొండ కోట పై జాతీయ జెండాను ఎగురవేశారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) విజయవాడ లో జరిగిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ జెండాను ఎగురవేసిన తరువాత ప్రధాని మోడీ ఢిల్లీ లో అలాగే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రులు ప్రజలకు ఇచ్చిన స్వాతంత్ర దినోత్సవ సందేశాలను ఇక్కడ చూద్దాం.
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, దేశం యొక్క యోగ్యతను గుర్తించే అవకాశాన్ని మరువ వద్దని ప్రజలను కోరారు.ఉదయం 7:34 గంటలకు తన ప్రసంగం ప్రారంభించిన ప్రధాని తన సుదీర్ఘ ప్రసంగంలో 2047 నాటికి భారత దేశాన్ని మరింత అభివృద్ది చెందిన దేశంగా చూడాలనే కాంక్షను వివరించారు. రాబోయే ఐదు సంవత్సరాలలో భారత దేశ బలోపేతానికి ఇంకా కృషి చేయాలని కోరారు. రాబోయే సంవత్సరాలలో ఎర్రకోటకు వస్తానని తాను చేసిన వాగ్దానాలను ప్రజలకు వివరిస్తాను అని ప్రధాని తన ప్రసంగం లో పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ముఖ్యమంత్రి తన ప్రసంగంలో
“మన జెండా.. 140 కోట్ల భారత దేశ ప్రజల గుండె అని . భారత దేశ జెండా మన దేశ ప్రజాస్వామ్యానికి గుర్తు. మన పూర్వీకుల త్యాగానికి గుర్తు మన జెండా. మువ్వన్నెల భారత పతాకం నిరంతరం మనకు స్ఫూర్తిని ఇస్తోంది. నా దేశ జెండాకి సెల్యూట్ చేస్తున్నాను. వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగంలో.. 76 ఏళ్లలో ఎంతో ప్రగతి కనిపించింది. సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం సాధించాం. ఆంధ్ర ప్రదేశ్ లో గ్రామాల అభివృద్ధికి 50 నెలల్లో ఎంతో కృషి చేశాం.
ఇంతకు ముందు ఏ ప్రభుత్వమూ అమలు చెయ్యని విధంగా అవినీతికి తావు లేకుండా లబ్దిదారులకే పథకాలు అందేలా చేస్తున్నాం. లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలోకే నేరుగా డబ్బును చేరవేస్తున్నాం. ప్రతీ పథకంలోనూ, సోషల్ ఆడిట్ చేశాం. పారదర్శకంగా లబ్దిదారుల్ని ఎంపిక చేస్తున్నాం. 76 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం ఇలా చేయలేదని అలాగే తమ ప్రభుత్వంలో సామాజిక న్యాయాన్ని కూడా అమలు చేశామని మంత్రి మండలిలో 68 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామని చెబుతూ తమ ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాలను సీఎం జగన్ తన ప్రసంగంలో వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణలో చరిత్రాత్మక గోల్కొండ కోట(Golkonda fort)లో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తమ ప్రభుత్వ కాలంలో తెలంగాణ అభివృద్ది చూసి యువత దేశంగా అచ్చెరువొందుతుందని,అభివృద్ది,సంక్షేమం రెండిటినీ సమ ప్రాతిపదికన చూస్తూ పేదలకు అండగా నిలుస్తుంది తమ ప్రభుత్వం అని పేర్కొన్నారు. తెలంగాణ(Telangana) ఏర్పడిన అతి తక్కువ సమయంలోనే ఎంతో పురోగతి సాధించిందని ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగంలో తెలంగాణ ప్రజలను కోరుకున్నారు.