TS Cabinet Meeting : రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజలకు మరింత సానుకూల వార్త అందింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మొన్నటి వరకు, లోక్ సభ ఎన్నికల కోడ్ ఉంది. ప్రస్తుతం, అన్ని అడ్డంకులు తొలిగిపోయిన తర్వాత, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో మరో రెండు మూడు రోజుల్లోనే కొత్త రేషన్ కార్డులు (New Ration Cards), ఆసరా పింఛన్ల మంజూరుపై కూడా చర్చ జరగనుంది. ఈ మేరకు ఖమ్మం జిల్లా తిరుమాయపాలెంలో జరిగిన సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు.
మరో రెండు, మూడు రోజుల్లో కేబినెట్ సమావేశం (TS Cabinet Meeting )జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేసే బాధ్యత కూడా తమదే అన్నారు. ఇప్పటికే మంత్రివర్గ సమావేశంలో రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకోగా.. ఈ కీలక హామీలను కూడా అమలు చేస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే ఆ హామీల అమలుకు కేబినెట్ సమావేశం జరిగే రోజునే గడువు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
కాగా, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అనర్హులకు పింఛన్లు అందితే వాటిని నిలిపివేసేవారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన పేదలకు పింఛన్లు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. గతంలో ప్రభుత్వం ఆసరా పింఛను రూ.2,016, వికలాంగుల పింఛన్ రూ.3,016 అందించగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వస్తే పింఛన్ రూ.4 వేలు, వికలాంగుల పింఛన్ రూ.6 వేలు ఇస్తామని ప్రకటించింది.
భూసమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు (Revenue Officers) గ్రామసభలు నిర్వహించాలని కోరారు. భూసమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. తెలంగాణ ప్రజల కృషి ఫలితంగానే ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
పాలేరు నియోజకవర్గంలో అర్హులందరికీ ఇళ్లు, ప్లాట్లు అందజేసే బాధ్యత తనదేనని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. వానాకాలం సాగుకు చివరి ఎకరాకు నీరు చేరుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రతిపాదించారు.