Uber Bus Services : సాధారణంగా, ప్రజలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లాలంటే బస్సులు, రైళ్లు, బైక్స్,ఉబెర్ సర్వీసెస్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే, ఉబర్ నుండి కొత్తగా మరో వార్త వచ్చింది. ఉబర్ నుండి కొత్త సర్వీసులు ప్రారంభం కానున్నాయి. మరి ఇంతకీ ఉబర్ ప్రారంభిస్తున్న సర్వీసులు ఏంటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ టాక్సీ సంస్థ ఉబెర్ త్వరలో కొత్త సేవను అందరి ముందుకు తీసుకురానుంది.కొత్తగా బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఈ సేవలు ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో అందుబాటులోకి రానున్నాయి. ఢిల్లీ ప్రీమియం బస్ స్కీమ్ పేరుతో ఈ బస్సులను నడుపుతుంది. ఆ మేరకు ఢిల్లీ రవాణా శాఖ నుంచి బస్సులను నడిపేందుకు ఉబర్ కంపెనీ లైసెన్స్ పొందింది. అయితే, ఇలాంటి తరహా లైసెన్స్ జారీ చేసిన రవాణా శాఖ ఢిల్లీ కావడం విశేషం.
ఈ బస్సులను ఢిల్లీ-ఎన్‌సిఆర్ మరియు కోల్‌కతాలో ఒక సంవత్సరం పాటు పరీక్షిస్తున్నట్లు ఉబర్ ఇండియా సిఇఒ అమిత్ దేశ్‌పాండే తెలిపారు. తమ బస్సులు చాలా ప్రసిద్ధి చెందాయని, ఢిల్లీలో అధిక డిమాండ్ ఉందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో తమ సేవలను అధికారికంగా ప్రారంభిస్తామని తెలిపారు. కోల్‌కతాలో బస్సు సర్వీసుల కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో ఏడాది కిందటే అవగాహన ఒప్పందం కుదిరిందని అమిత్ దేశ్‌పాండే పేర్కొన్నారు.
ప్రయాణీకులు ఒక వారం ముందుగానే బుక్ చేసుకోవచ్చని ఉబర్ పేర్కొంది. ఉబర్ యాప్ బస్సు వచ్చే సమయాలు, లొకేషన్ మరియు రూట్ గురించి రియల్ టైమ్ సమాచారాన్ని అందిస్తుందని వివరించింది. ఒక్కో సర్వీసులో 19-50 మంది ప్రయాణించవచ్చని పేర్కొంది. ఉబర్ టెక్నాలజీని ఉపయోగించి స్థానిక ఆపరేటర్లు వీటిని నడుపుతారని ఉబెర్ చెప్పింది.
ఢిల్లీ రవాణా శాఖ అధికారులు, “ప్రజా రవాణా సేవలను మెరుగుపరచడానికి మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని పేర్కొన్నారు. ఢిల్లీలో ఈ బస్సు సర్వీసులు విజయవంతం అయితే, దేశ ప్రధాన నగరాల్లో ఇవి నడపాలని ఉబర్ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.