WhatsApp Update : వాట్సాప్ రోజురోజుకీ యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న యాప్స్‌లో మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
యూజర్ల అవసరాలకు అనుగుణంగా సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తున్న వాట్సాప్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. ఈ ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వాట్సాప్ తన వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడానికి ‘Meta’ సంస్థ WhatsAppకు అనేక నవీకరణలు మరియు ప్రత్యేకమైన మార్పులను ప్రవేశపెడుతోంది. ఇటీవల, థీమ్ రంగు మారింది. ఇంతకముందు ఈ థీమ్ ‘నీలం’గా ఉండేది, అయితే ఇప్పుడు అది ఆకుపచ్చగా మారింది.
భారతీయులు తమ వాట్సాప్‌లో(WhatsApp) కూడా ఈ మార్పును గమనించవచ్చు. అయితే, వినియోగదారులు దీని గురించి విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరేమో ఈ కొత్త మార్పు బాగుందని చెప్తుంటే, మరికొందరేమో ఈ ‘పచ్చ’ రంగు బాలేదని అభిప్రాయపడుతున్నారు.
ఈ మార్పు వెనుక కారణం ఏంటి?
యాప్ వినియోగాన్ని మెరుగుపరచడానికి మరియు వినియోగదారులకు కొత్త అనుభవాన్ని అందిం చడానికి థీమ్ రంగును (Theme color) ‘ఆకుపచ్చ’గా మార్చినట్లు మెటా సంస్థ పేర్కొంది. అంతే కాదు లుక్ కూడా కాస్త మార్చామని, స్పేసింగ్‌తో పాటు ఐకాన్స్‌లోనూ కొద్దిపాటు మార్పులు చేయడం జరిగిందని ఆ కంపెనీ వెల్లడించింది.
స్టేటస్ బార్ (Status bar) నుండి చాట్-జాబితా విండో వరకు, పూర్తిగా మారిపోయింది. యాప్‌లో షేర్ చేయబడిన లింక్‌లు కూడా ఇప్పుడు నీలం రంగులో కాకుండా ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. డార్క్ మోడ్ (Dark mode) అయితే మరింత ముదురు రంగులోకి మారడాన్ని గమనించవచ్చు.
ఇతర మార్పులు ఏంటి?
ఇంతకుముందు, వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఉన్నా లేదా సందేశాన్ని టైప్ చేసినా, అన్ని ఆంగ్ల అక్షరాలు చిన్న ఫాంట్‌లో చూపించబడ్డాయి. అయితే ఇటీవలి సవరణల్లో భాగంగా ఆ రెండు పదాల ముందు ఉన్న అక్షరాలను క్యాపిటలైజ్ చేశారు.
అంటే, ‘online’ని ‘Online’గా, ‘typing’ని ‘Typing’గా మార్చడం జరిగింది. Meta ఈ సర్దుబాట్లు తన వినియోగదారులకు భిన్నమైన అనుభవాన్ని అందించడానికి జరిగాయని పేర్కొంది. మరి, మీరు మీ వాట్సాప్ లో ఈ మార్పులను గమనించారా?