Telugu Mirror : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు శుభవార్త(Good news) చెప్పింది.YSR ఆసరా పింఛన్ల రూపంలో రూ.10,000 లబ్ధిపొందుతున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై వ్యాధిగ్రస్తులకు ఉచిత బస్‌పాస్‌లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని(Rajini) ప్రకటించారు. మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి ఈ నిర్ణయం గురించి తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కార్యదర్శి డాక్టర్ మంజుల, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ జె.నివాస్, ఆంధ్రప్రదేశ్ వైధ్య విధాన పరిషత్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంధ్రప్రసాద్, ఏపీఎంఎస్ ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, డీఎంఈ నరసింహం, డీహెచ్ రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్, కిడ్నీ లాంటి ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పూర్తిస్థాయిలో చేదోడుగా నిలబడ్డారన్నారు.
సికెల్‌సెల్ ఎనీమియా, థలసేమియా వంటి వ్యాధులకి గురియై బాధపడే వారికి ఈ ఉచిత బస్ పాస్(Bus Pass)ల వల్ల చాలా ఉపయోగం కలుగుతుందని అన్నారు. ‘ఐబ్రెస్ట్’ అనే పరికరం ద్వారా మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ని నిర్థారించే పరీక్షలను ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు చర్యలు ప్రారంభించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ(Arogya sree) పరిధిలో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్స్ లో 5% పడకలను పాలియేటివ్ కేర్ కు గురైన వ్యాధిగ్రస్తులకు చికిత్స చేసేందుకు కేటాయించాలని చెప్పినారు. విశాఖపట్నం లోని హోమీబాబా క్యాన్సర్ ఆసుపత్రి ఆధీనంలో నడిచే క్యాన్సర్ గ్రిడ్‌కు క్యాన్సర్ చికిత్సను అందించే ఆసుపత్రులు మిళితం అయ్యేలా చూడాలని ఆదేశించారు.
శ్రీకాకుళం(Sreekakulam) జిల్లాలో దశాబ్దాలుగా ఉద్దానం ప్రాంతంలో ప్రాణాంతకంగా మారి కిడ్నీ(Kidney) వ్యాధి ద్వారా మరణిస్తున్న ప్రజలను ఆదుకొని, మరణాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉద్దానం తాగునీటి ప్రాజెక్టును పూర్తి చేసి, ట్రయల్ రన్ నిర్వహించారని త్వరలోనే దానిని ప్రారంభిస్తామన్నారు. కిడ్నీ వ్యాధి గ్రస్తులకు మరింత మేలైన వైద్యసేవలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు పలాస(Palasa)లో కిడ్నీ రీసెర్చి సెంటర్‌ను అతి త్వరలో వినియోగంలోకి తీసుకొస్తున్నామని చెప్పారు.
ఏరియా ఆసుపత్రుల్లో కూడా భౌతికకాయాల తరలింపుకు ఉపయోగించే మహాప్రస్థానం వాహనాలను అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రభుత్వం కొత్తగా 108 అంబులెన్సులను వినియోగం లోకి తీసుకు వచ్చినందున, పాతవాటి పనితీరును పరీక్షించి బాగున్నవి మహాప్రస్థానం కింద ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి, పక్షవాతంతో మంచానికే పరిమితమైన వారికి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ప్రభుత్వం ఆసరాగా నిలిచింది. అనేకమంది వ్యాధిని తగ్గించుకునేందుకు మందుల ఖరీదుకు డబ్బులు లేని పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్నారు.
మందులు కొనుగోలు చేయడం కోసం జగన్ ప్రభుత్వం రూ.3,000 నుంచి అత్యధికంగారూ.10,000 వరకు ప్రతినెలా పింఛన్(Pension) ను అందజేస్తోంది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని మెడికల్ కాలేజీలలో ఉన్న వైద్యుల బృందం పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేసిన వారిని అర్హులుగా నిర్ణయించిన వారికే ఈ పెన్షన్ ను అందజేస్తారు. తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధి, సీవియర్ హీమోఫీలియాకి గురై బాధపడే వారికి ఉచితంగా మందులు ఇవ్వడమే కాకుండా నెలకు రూ.10,000 ఇస్తున్నారు..దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అండగా నిలబడుతోంది.