Telugu Mirror : దేశంలో ఎల్ పిజి(LPG) వంటగ్యాస్ వినియోగదారులకు ఉపశమనం కలిగించే దిశగా, రక్షా బంధన్ పండుగను పురస్కరించుకుని మహిళలకు కానుకగా 14.2 కిలోల ఎల్‌పిజి వంట గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర మంత్రి వర్గం మంగళవారం రూ. 200 తగ్గించింది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఇప్పటికే కేంద్రం విమర్శల పాలవుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది.కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) వెల్లడించిన వివరాల ప్రకారం రక్షా బంధన్ మరియు ఓనం పండుగల సమయాన డొమెస్టిక్ సిలిండర్ల ధరను రూ. 200 తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి(Narendra Modi) దేశంలోని మహిళలకు ఇచ్చిన “రక్షాబంధన్ బహుమతి” అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం కింద ఉన్న లబ్ధిదారులకు కూడా ధర తగ్గింపు వర్తిస్తుంది. ప్రస్తుతం, దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో 14.2 కిలోల LPG (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1,103 ఉంది. ఈ ధర బుధవారం నుండి, రూ. 903 కి తగ్గుతుంది.
ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన పథకం(Ujjwala Yojana Scheme) క్రింద ఉన్న లబ్ధిదారులకు, తగ్గిన ధరతో ప్రస్తుతం సిలిండర్ ధర రూ.703 లభిస్తుంది. ఈ సంవత్సరం మార్చిలో, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ప్రభుత్వం ప్రతి ఎల్ పిజి వంటగ్యాస్ సిలిండర్ పై సబ్సిడీని రూ. 200 పెంచింది.
ప్రస్తుతం ఉజ్వల పథకంలో 9.6 కోట్ల మంది గ్యాస్ సిలిండర్(Gas Cylinder) లబ్ధిదారులు ఉన్నారని మంత్రి తెలిపారు. అలాగే “ఉజ్వల పథకం క్రింద ప్రభుత్వం త్వరలో ఉచితంగా 75 లక్షల కొత్త ఎల్ పిజి వంట గ్యాస్ సిలిండర్ల కనెక్షన్ లను కూడా అందజేస్తుంది” అని అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశీయ ఎల్ పిజి (LPG) సిలిండర్ల ధరను మే లో రెండు సార్లు పెంపుదలల తరువాత జూలై నెలలో రూ.50 పెంచాయి.ప్రపంచ ఇంధన ధరలు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం అనేక ఉపశమన చర్యలను తీసుకున్న సమయంలో ప్రథాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు సబ్సిడీని గత సంవత్సరం మేలో ప్రవేశపెట్టారు.